మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (10:32 IST)

తమిళనాడు ఎన్నికలు : బీజేపీకి 20 అసెంబ్లీ సీట్లు కేటాయింపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, కూటమి పార్టీల మధ్య సీట్ల ఒప్పందం జరుగుతోంది. ఇందులోభాగంగా, అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీకి కేవలం 20 సీట్లు మాత్రమే కేటాయించారు. అలాగే, కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థే పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.
 
అలాగే, ఎంపీ వసంత్ కుమార్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన కన్యాకుమారి నుంచి కూడా బీజేపీ పోటీ చేయనుంది. వారం రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీ పార్టీల మధ్య ఈ అంగీకారం కుదిరింది. 
 
ఈ మేరకు అన్నాడీఎంకే కోఆర్డినేటర్ ఒ. పన్నీర్‌సెల్వం, జాయింట్ కోఆర్డినేటర్ ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ జాతీయ కార్యదర్శి సిటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
 
బీజేపీ పోటీ చేయనున్న స్థానాలపై త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీకి అన్నాడీఎంకే మద్దతు ఇస్తుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత హెచ్. వసంత్‌కుమార్ చేతిలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. అయితే, గతేడాది ఆగస్టులో కరోనా కారణంగా వసంత్ కుమార్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
 
ఇదిలావుంటే, ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం తమ మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుల్లో నిమగ్నమైవున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే ఆరుగురు సభ్యులతో తొలి జాబితాను శుక్రవారం తొలి జాబితాను ప్రకటించింది. 
 
ఈ ఆరుగురు జాబితాలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, న్యాయశాఖ మంత్రి వి.షణ్ముగం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్, ఎస్. తేన్‌మొళిలకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా, మిగతా అభ్యర్థులను మరికొన్నిరోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి.
 
తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే... పళనిస్వామి- ఎడప్పాడి (సేలం జిల్లా), పన్నీర్ సెల్వం- బోధినాయకన్నూర్ (థేని జిల్లా), డి.జయకుమార్- రాయపురం, వే షణ్ముగం- విల్లుపురం, ఎస్పీ షణ్ముగనాథన్- శ్రీవైకుంఠం, ఎస్.తేన్‌మొళి- నీలక్కొట్టాయ్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.