శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:46 IST)

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ వేస్తే రూ.1200 అపరాధం.. ఎక్కడ?

ముంబై నగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఉమ్మివేస్తే రూ.1200 అపరాధం విధించేలా చట్టాన్ని తెచ్చారు. నిజానికి గతంలో ఇది రూ.200గా ఉంటే, ఇపుడు రూ.1200కు పెంచారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, రోడ్డుమీదనే ఉమ్మివేయడం తదితర అపరిశుభ్ర చర్యల వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు పరిశుభ్రతకు పెద్దపీఠ వేస్తున్నారు. 
 
రోడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. అదేసమయంలో అపరిశుభ్రతకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ముంబై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇప్పటివరకు రూ.200 ఫైన్ మాత్రమే విధించే వారు. అయితే, ఇప్పుడు ఆ జరిమానా మొత్తాన్ని రూ.1200 పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది.
 
గ్రేటర్ ముంబై పరిశుభ్రత, పారిశుద్ధ్యం బైలా 2006 ప్రకారం.. ఈ ప్రతిపాదనను రాష్ట్రం ప్రభుత్వం ఆమోదించకున్నా.. బీఎంసీ జనరల్ బాడీ ఆమోదిస్తే సరిపోతుందని అక్కడి అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినందుకు ఇప్పటి వరకు రూ.200 మాత్రమే జరిమానా విధిస్తూ వచ్చారు. అయితే, ఈ ఫైన్‌కు ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఆ మొత్తాన్ని భారీగా పెంచాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా గత ఆర్నెల్ల కాలంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వ్యక్తులపై రూ.28.67 లక్షల జరిమానా వసూలు చేయడం గమనార్హం.