విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి దేశభక్తుడు కాలేడు.. చాణక్యుడు చెప్పారట..!
భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీ ఆయన తల్లి సోనియా గాంధీ దేశభక్తిని ప్రగ్యా ఠాకూర్ ప్రశ్నించారు.
"ఈ గడ్డపై జన్మించినవాడే దేశాన్ని కాపాడతాడు. ఒక విదేశీ వనితకు పుట్టినవాడు దేశభక్తుడు కాలేడని చాణక్య చెప్పారు. ఒకవేళ మీకు రెండు దేశాల్లో పౌరసత్వం ఉంటే దేశభక్తి అనుభూతి ఎలా కలుగుతుంది" ప్రగ్యా విమర్శలు గుప్పించారు.
ఆయుధాలు లేకుండా జవాన్లను పంపారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, చైనా మన ప్రాంతాన్ని ఆక్రమించిందా, దాచివుంచడం దౌత్యనీతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్, సోనియా, మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కాంగ్రెస్‌పై ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ జాబితాలో ప్రగ్యా కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నీతి, నైతికత, దేశభక్తికి ఆ పార్టీ దూరమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.