వీధుల్లో పడ్డ వలస కూలీలకు కావల్సింది అప్పు కాదు, డబ్బు: రాహుల్ గాంధీ
కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోసం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతులకు కానీ, వలస కార్మికులకు కానీ తక్షణ ఉపశమనం ఇవ్వదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సంక్షోభ సమయంలో మన ప్రజలకు డబ్బు కావాలి. ప్యాకేజీలు కాదు. వీధిలో నడుస్తున్న వలస కూలీకి డబ్బు కావాలి, అప్పు కాదు. బాధపడుతున్న రైతుకు డబ్బు కావాలి, అప్పు కాదు. మనం చేయకపోతే ఇది విపత్తుగా పరిణమిస్తుంది.
లాక్డౌన్ ద్వారా నిరుద్యోగులుగా మిగిలిపోయిన వలసదారుల బ్యాంకు ఖాతాలకు కనీసం 7,500 రూపాయలు నేరుగా బదిలీ చేయాలని పిఎం మోడీకి రాహుల్ గాంధీ అభ్యర్థన చేశారు. కాగా కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 86,000 కేసులు నమోదవగా 2,700 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన ఈ కరోనా వైరస్ కారణంగా వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.