ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (11:31 IST)

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటి అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్..!

pooja
మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ నివాసంపై బుల్డోజర్ ప్రయోగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ఇంటి వద్ద అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. వీటిని బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. పుణెలోని ఆమె కుటుంబ నివాసం బయట ఉన్న అక్రమనిర్మాణాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఆ ఇంటికి ఆనుకొని ఉన్న నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చివేసింది. దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అధికారులు వెల్లడించారు.
 
కాగా, పుణెలో బ్యూరోక్రాట్‌గా పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో కొద్దిరోజుల క్రితం ఖేడ్కర్ పేరు వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్‌లో ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.
 
ఇక ఆ వివాదం తర్వాత నుంచి ఆమెకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తన దివ్యాంగ ధ్రువీకరణకు చూపిన పత్రాల్లో కూడా అవకతవకలు ఉన్నట్లు సమాచారం. ఆమె చూపిన ఓ పత్రాల్లో ఇంటి చిరునామా కాకుండా ఓ ఫ్యాక్టరీ అడ్రెస్ ఉన్నట్లు తాజాగా బయటకు వచ్చింది. సదరు ఇంజినీరింగ్ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి రూ.2.7 లక్షల పన్నులు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారని వాటి సారాంశం. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.