శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (16:03 IST)

ఇంటర్నెట్ బంద్ చేసి హామీలా.. ఇది పుండుమీద కారం చల్లినట్టే

పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) ఇపుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ బిల్లుకు నిరసనగా ఈశాన్య రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛంగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళలు చేస్తున్నాయి. ఈ ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా అస్సోం రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోయాయి. దీంతో ఇంటర్నెట్ సేవలను అస్సోంలోని అధికార బీజేపీ సర్కారు నిలిపివేసింది. 
 
పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లపై ప్రధాని మోడీ స్పందిస్తూ, 'అస్సాంలోని నా సోదరులు, సోదరీలకు హామీ ఇస్తున్నా... క్యాబ్ ఆమోదం కారణంగా ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ హక్కులు, అస్తిత్వం, అద్భుతమైన మీ సంస్కృతిని ఎవరూ లాక్కోలేరు. అది మరింత విస్తరిస్తూ వర్థిల్లుతుంది' అని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మోడీ ట్వీట్‌పై సెటైర్లు వేస్తున్నారు. 
 
'అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే.. ప్రధాని సందేశం వారికి ఎలా చేరుతుందంటూ' ప్రశ్నించారు. అలాగే, 'దీనికంటే మీరే స్వయంగా అసోం వెళ్లి.. 'సబ్ చంగా సి' (అంతా బాగానే ఉంది) అని చెప్పండి. ఎందుకంటే మీ ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మీ సందేశం వాళ్లు చదవలేరు. కాశ్మీర్ ప్రజలు కూడా అస్సామీలకు సంఘీభావం తెలుపుతున్నారు' అంటూ ట్వీట్ చేశారు. 
 
'అసోంలోని సోదరీ, సోదరులకు ఇంటర్నెట్ లేదు. కాశ్మీర్‌లోని సోదరీ, సోదరుల మాదిరిగానే మీ సందేశాలు వాళ్లు కూడా మిస్ అవుతారు' అని మరొకరు ట్వీట్ చేశారు. 'మోడీగారు ఓవైపు అసోంలో ఇంటర్నెట్ ఆపేసి, మరోవైపు హామీలు ఇస్తున్నారు. ఇది పుండు మీద కారం చల్లినట్టుంది ఆయన వ్యవహారం' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.