శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (09:19 IST)

భగవంతుడు పేరు చెప్పి చెట్లు నరుకుతామంటే కుదరదు... సుప్రీంకోర్టు

శ్రీకృష్ణభగవానుడు పేరు చెప్పి వేలాది చెట్లను నరికి వేస్తామంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ రాష్ట్రంలోని మధుర జిల్లాలో ఉన్న ఓ శ్రీ కృష్ణ మందిరానికి వెళ్లేందుకు వీలుగా 25 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు తలపెట్టింది. ఇందుకోసం 2,940 చెట్లను తొలగించాల్సి వుంది. ఈ చెట్ల తొలగించేందుకు రూ.138.41 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లిస్తామని, అందువల్ల చెట్ల నరికేందుకు తమకు అనుమతించాలని కోరుతూ యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
 
ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొప్పన, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి.. భగవంతుడు పేరు చెప్పి మూడు వేల చెట్లను నరికివేస్తామంటే అనుమతించబోమని చెప్పింది. 
 
చెట్లను కొట్టివేసిన తర్వాత, మరిన్ని చెట్లను నాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా, ఈ మాటలతో తాము మనసు మార్చుకోబోమని, 100 సంవత్సరాల వయసున్న చెట్టును తొలగించి, ఓ మొక్కను నాటడం ఎలా సమానం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. 
 
అంతేకాకుండా, 'మనిషి మనుగడ చెట్లపై ఆధారపడివుంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. దాని విలువను లెక్కించలేము. చెట్ల మిగిలిన జీవిత కాలాన్ని బట్టి, దాని విలువ మారుతుంటుంది. చెట్లను నరకడానికి అంగీకరించలేం' అని అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదేసమయంలో కృష్ణ మందిరానికి రహదారి నిర్మించే విషయంలో మరో ప్రతిపాదనతో నాలుగు వారాల్లోగా కోర్టు ముందుకు రావచ్చని పేర్కొంది.