1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (19:29 IST)

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మేం సిద్దం : ఎన్నికల సంఘం

దేశంలో గడువు ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సివుంది. 
 
ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీలకు 2022తో గడువు ముగియనుంది. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్నికలకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
 
ఇదే అంశంపై భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిలో ఉన్న సమయంలోనూ పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి, తగిన అనుభవాన్ని సంపాదించుకున్నామన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని, త్వరలోనే కరోనా వ్యాప్తి ముగిసిపోతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
 
సీఈసీ వ్యాఖ్యలు అటుంచితే... ఇటీవల పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి ఈ ఎన్నికలు కూడా ఓ కారణమని నిపుణులు ఆరోపించడం తెలిసిందే. 
 
అయితే, యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేది 2022లో కావడంతో, అప్పటిలోగా వ్యాక్సినేషన్ చాలావరకు ముందుకు సాగుతుందని, ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే సీఈసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధణని ప్రకటించివుంటారని తెలిపారు.