ఒకే ఒక అక్షరంతో ప్రపంచ రికార్డును కోల్పోయిన చెన్నై సెంట్రల్
చెన్నై నగరానికి తలమానికంగా ఉండేది చెన్నై సెంట్రల్. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒది ఒకటి. అలాంటి సెంట్రల్ రైల్వే స్టేషన్ కేవలం ఒకే ఒక్క అక్షరంతో ప్రపంచ రికార్డును తృటిలో చేజార్చుకుంది. అదేంటంటే... ప్రపంచంలోనే అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఇటీవల చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ పేరును "పురట్చి తలైవర్ డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్"గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీచేసింది. దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కాస్త "పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీరామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్"గా పేరు మార్చారు.
ప్రపంచంలో అత్యధిక అక్షరాలు కలిగిన రైల్వే స్టేషన్ల జాబితాలో చెన్నై సెంట్రల్ చోటుసంపాదించుకుంది. కానీ, ఒకే ఒక్క అక్షరం తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోయింది. అతిపెద్ద పొడవైన పేరు కలిగిన రైల్వే స్టేషన్ల జాబితాలో 58 అక్షరాలతో వేల్స్ (Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch) రైల్వేస్టేషన్ మొదటి స్థానంలో ఉండగా, 57 అక్షరాలతో చెన్నై సెంట్రల్ స్టేషన్ రెండో స్థానంలో ఉంది.
ఇక మన దేశంలో పొడవాటి పేర్లున్న రైల్వే స్టేషన్ల సంఖ్య తక్కువేమీ కాదు. కర్ణాటకలో "క్రాంతివీర సాంగొలి రాయన్న బెంగుళూరు సిటీ" (కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ), ఏపీలో "వెంకట నరసింహ రాజువాణి పేట", మహారాష్ట్రలో "ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్" (సీఎస్టీ టెర్మినల్) వంటి అధిక అక్షరాలు గల స్టేషన్లుగా ఉన్నాయి.