గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (15:58 IST)

పూజారితో ఆరుసార్లు కొరడాతో కొట్టించుకున్న ముఖ్యమంత్రి.. ఎందుకు?

చాలా మంది ముఖ్యమంత్రులకు అమితమైన దైవభక్తి ఉంటుంది. ఈ కారణంగా వారు వివిధ రకాల యాగాలు, పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. అలాగే, తమకు తోచినపుడల్లా వివిధ ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇలాంటి వారిలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఒకరు. 
 
ఈయనకు అపారమైన భక్తిప్రపత్తులు ఉన్నాయి. అదేసమయంలో మూఢనమ్మకం కూడా బాగానే ఉంది. దీంతో ఓ పూజారితో ఆయన కొరఢా దెబ్బలు కొట్టించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇటీవల గోవర్ధన పూజ జరిగింది. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్.. ఓ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ సంప్రదాయం ప్రకారం అక్కడి పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. ఇక్కడ అమ్మవారి ఎదుట ఇలా కొరడా దెబ్బలు తింటే శుభం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఆయన చేతిని చాపి, కొరడా దెబ్బలు తిని వెళ్లాలని భావించారు.
 
ముఖ్యమంత్రిని కూడా సామాన్య భక్తుడిగానే భావించిన పూజారి ఆరు కొరడా దెబ్బలు కొట్టారు. అనంతరం భూపేశ్ భగేల్.. తన చేతిని తీసేశారు. కొరడా దెబ్బలు తింటోన్న సమయంలో భూపేశ్ నవ్వుతూ కనిపించారు. అనంతరం పూజారి సీఎంకు నమస్కరించారు. పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకున్న సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.