శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (08:48 IST)

సెప్టెంబర్‌–అక్టోబర్‌ మధ్య పంజా విసరనున్న కోవిడ్‌

దేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్‌–అక్టోబర్‌ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్‌ వేవ్‌ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. 
 
కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్‌లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు  ఉంటుందని తెలిపింది.  భారీ సంఖ్యలో పిల్లలు వైరస్‌ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.
 
కొత్త వేరియంట్లతో ముప్పు
జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. 
 
ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది.
 
సామూహిక నిరోధకత సాధించేదాకా..
భారత్‌లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచకపోతే థర్డ్‌ వేవ్‌లో నిత్యం 6 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది.
 
ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్‌లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్‌ వేవ్‌ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్‌ నిపుణులు గతంలో తెలిపారు.