1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (10:41 IST)

ప్రచండ ఫణి... పూరీ వద్ద తీరాన్ని తాకిన పెను తుఫాను

గతవారం రోజులుగా భయపెడుతూ వచ్చిన ఫణి తుఫాను ఎట్టకేలకు ఒడిషా రాష్ట్రంలోని పూరీ వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పయనించింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి ఇది పూర్తిగా తీరాన్ని దాటుకుందని, ఆపై క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అయితే, ఈ తుఫాను తీరందాటే సమయంలో గాలులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఒడిషా రాష్ట్రంలో ఈతుఫాను ప్రభావం 10 వేలకు పైగా గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ తుఫాను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిగా బలహీనపడి... ఆ తర్వాత బంగ్లాదేశ్ వైపు పయనించవచ్చని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. 
 
మరోవైపు ఈ ప్రచండ తుఫాను ముప్పు నుంచి శ్రీకాకుళం జిల్లా బయటపడిందని ఆ జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఫణి తుఫాను జిల్లాకు దూరంగా తీరం దాటటడంతో పెను ముప్పు తప్పినట్టేనని ఆయన వెల్లడించారు. అయితే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుకు అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
తుఫాను ప్రభావం దృష్ట్యా గురువారం రాత్రంతా కలెక్టరేట్‌లోనే బస చేసిన ఆయన... ఫణి తుఫాను తీరందాటిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తుఫాను తీరప్రాంత మండలాలపై తీవ్ర ప్రభావం చూపిందనీ, ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయని చెప్పారు. ఈ గాలుల ప్రభావానికి గుడిసెలు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్టు చెప్పారు. కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైందని తెలిపారు.