బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (09:03 IST)

దంపతుల మధ్య "ఆర్థిక సంక్షోభం"?

వారిద్దరూ అన్యోన్య దంపతులు. కానీ దేశ ఆర్థిక సంక్షోభం వారి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ఒకదాని తర్వాత మరో రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా దీన్ని అంగీకరించేందుకు మోదీ సర్కారు సిద్ధంగా లేదు’’.. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌! సోమవారం ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమై న ఆయన వ్యాసం సంచలనం సృష్టిస్తోంది.

ఇందులో ఆయన మోదీ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నెహ్రూ ఆర్థిక విధానాలను రాజకీయ కోణంలో విమర్శించడం తప్ప బీజేపీకి సొంత విధానమంటూ లేదు. ఆర్థికవిధానాలకు సంబంధించి ‘ఇది కాదు, ఇది కాదు’ అనడమే తప్ప ఏది ఉండాలన్న స్పష్టతలేదని విమర్శించారు.

ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ల విధానాలే శరణ్యమని చెప్పారు.
 
మౌలిక సంస్కరణలు మావే: నిర్మల
తన భర్త రాసిన వ్యాసంలోని వాడి విమర్శలపై నిర్మలా సీతారామన్‌ సూటిగా స్పందించలేదు. అయితే, 2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జీఎస్టీ, ఆధార్‌, వంట గ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది మోదీ సర్కారేనని తెలిపారు.