శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (10:13 IST)

గోరఖ్‌పూర్‌లో మరణ మృదంగం... పార్టీల శవ రాజకీయాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో మృత్యుఘోష వినిపిస్తోంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. పైపెచ్చు, శవ రాజకీయాలు చేసేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. స్థానిక బాబా రాఘవ్ దాస్ (బీఆర్‌డి) ఆస

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో మృత్యుఘోష వినిపిస్తోంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. పైపెచ్చు, శవ రాజకీయాలు చేసేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. స్థానిక బాబా రాఘవ్ దాస్ (బీఆర్‌డి) ఆస్పత్రి గత కొన్ని రోజులుగా మరణమృదంగాన్ని తలపిస్తోంది. ఇక్కడ ఒక్క ఆగస్టు నెలలోనే 296 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 213 నవజాత శిశువులు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 83 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోయారు. 
 
ఈ యేడాది ఇప్పటివరకు ఏకంగా 1256 మంది చనిపోయారు. అయినా పాలకుల్లో ఏమాత్రం చలనం లేదు. పైపెచ్చు.. అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీలు శవరాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఫలితంగా అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
 
ఇదే అంశంపై బీఆర్డీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆస్పత్రిలోని మెదడువాపు, చిన్నారుల వార్డుల్లో దాదాపు 1,256 మంది మృతి చెందినట్లు తెలిపారు. 
 
గడిచిన 24 గంటల్లో 17 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో 37 మంది పిల్లలు (వీరిలో 11 మంది మెదడువాపు వ్యాధితో) ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారని సింగ్‌ వెల్లడించారు. 
 
నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువు ఉండడం, కామెర్లు, న్యుమోనియా, ఇన్ఫెక్షన్, మెదడువాపు తదితర కారణాలతో, విషమ పరిస్థితుల్లోనే చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారని సింగ్‌ తెలిపారు. చిన్నారులను కొంచెం ముందుగా ఆస్పత్రికి తీసుకురాగలిగితే చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు.