ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా హిమపాతం... మంచుతో నిండిపోయిన ఇళ్ల పైకప్పులు

snowfall in j&k
ఠాగూర్| Last Updated: బుధవారం, 18 నవంబరు 2020 (10:30 IST)
జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురిసింది. దీంతో చెట్లు, ఇళ్ళ పైకప్పులు మంచుతో నిండిపోయాయి. అదేసమయంలో ఢిల్లీతో సహా హర్యానా, పంజాబ్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. కుఫ్రి, మనాలి, ఆలి తదితర పర్యాటక ప్రాంతాలల్లో భారీగా హిమపాతం కురుస్తోంది.

అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్‌లోని కొండలు, రాంబన్‌లోని ముఖ్యమైన జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారి మూతపడింది. అలాగే కుప్వారా, బండిపోరా, బారాముల్లా, గండర్‌బల్‌ నాలుగు జిల్లాలో హిమపాతం హెచ్చరికలు జారీచేశారు. భారీ మంచువర్షం మధ్య ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలు శీతాకాలం సందర్భంగా మూసివేశారు.

అంతేకాకుండా, హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక ప్రాంతాలైన కుఫ్రి, మనాలిని మంచు కప్పేసింది. కుఫ్రీలో 7 సెంటీమీటర్ల హితమపాతం కురవగా.. కులు జిల్లాలోని మనాలిలో గత 24గంటల్లో 2 సెంటీమీటర్లు కురిసిందని షిమ్లా మీట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు.

సాంగ్లాలో 25, గోండ్లాలో 20, ఖద్రాలాలో 18, కల్ప 5.6, కీలాంగ్‌లో 4 సెంటీమీటర్ల హిమపాతం పడిందని అలాగే.. రాష్ట్ర రాజధాని షిమ్లాతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లోనూ 21.6 మిల్లీమీటర్ల మంచు వర్షం కురిసిందని చెప్పారు. గిరిజన జిల్లా లాహౌల్‌, స్పితి పరిపాలన కేంద్రం కీలాంగ్‌లో మైనస్‌ 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. పలు చోట్ల సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

జమ్మూ కాశ్మీర్‌లో ఎత్తైన సింథన్ పాస్ వద్ద భారీ హిమపాతంలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, చిన్నారులతో సహా పది మందిని భద్రతా దళాలు రక్షించినట్టు రక్షణ ప్రతినిధి తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్ జిల్లాను కాశ్మీర్ అనంతనాగ్‌తో కలిపే సింథన్ పాస్ వద్ద చిక్కుకున్న పౌరుల గురించిన సమాచారం వచ్చిన తర్వాత సహాయక చర్యలు చేపట్టి రక్షించినట్టు తెలిపారు.

ఆర్మీ, పోలీస్‌ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీం రాత్రి సమయంలో ఎదురుగా ఏమీ కనిపించని పరిస్థితుల్లోనూ ఐదుగంటల పాటు నడిచి వెళ్లి పది మందిని రక్షించి సింథాన్‌కు తరలించి ఆహారం అందించి, ఆశ్రయం కల్పించారు. అలాగే భారీ హిమపాతం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించింది. జవహర్‌ టన్నెల్‌, రాంబన్‌ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ - శ్రీనగర్‌ రహదారి మూసివేశారు.దీనిపై మరింత చదవండి :