హస్తం గుర్తుకు ఓటు వేయొద్దు.. బీఏపీ అభ్యర్థికి ఓటు వేయండి : కాంగ్రెస్ నేతల ప్రచారం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం నిర్వహిస్తోంది. చేయి గుర్తుకు ఓటు వేయకండని... కాంగ్రెస్ నాయకులే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందుకు ఓ కారణం ఉంది. బన్వేరా - దుంగర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అరవింద్ దామెర్‌ను బరిలోకి దింపింది. బీఫామ్ ఇవ్వడంతో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.
కానీ నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ఒకరోజు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్ కుమార్ రోట్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ అభ్యర్థి అరవింద్ దామెర్‌కు స్పష్టం చేసింది. దీంతో ఆయన పార్టీ పెద్దల వద్ద నామినేషనను వెనక్కి తీసుకుంటానని చెప్పారు. కానీ, ఆ తర్వాత నుంచి ఉపసంహరణ గడువు ముగిసే వరకు కనిపించకుండా పోయారు.
నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత బయటకు వచ్చిన అరవింద్ మాట్లాడుతూ... తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మద్దతిచ్చిన పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో, ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి ఓటు వేయవద్దని... మనం మద్దతిచ్చిన భారత్ ఆదివాసీ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది.