1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (16:06 IST)

కేరళ పసుపు చికిత్సకు అమెరికాలో పేటెంట్ వచ్చేసింది..

పసుపుకు ఆయుర్వేదం దివ్యౌషధం అనే పేరుంది. యాంటీ-బ్యాక్టీరియల్‌గా పనిచేసే పసుపు వాపును తగ్గిస్తుంది. రక్తపు గడ్డలను కరిగించే శక్తి కూడా పసుపుకు వుంటుంది. ఈ నేపథ్యంలో కేన్సర్ వ్యాధికి కేరళ సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రకం పసుపు ట్రీట్‌మెంట్‌కు అమెరికాలో పేటెంట్ లభించింది.
 
కేన్సర్ వ్యాధి తిరగబెట్టకుండా పసుపుతో పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కొత్త ట్రీట్‌మెంట్‌ను తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ (యూఎస్ పీటీవో) నుంచి ఆమోదం లభించినట్లు ఇనిస్టిట్యూ ట్ హెడ్ లిస్సీ కృష్ణన్ వెల్లడించారు. 
 
ఇంకా కేన్సర్ కణాలను నాశనం చేసే గొప్ప గుణం పసుపులోని కుర్ క్యుమిన్ అనే రసాయనానికి ఉందని శ్రీచిత్ర ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే కుర్ క్యుమిన్ ను నేరుగా మందులా ఉపయోగించడం కుదరదని, అందుకే తాము దీనిని వాడేందుకు కొత్త టెక్ నాలజీని డెవలప్ చేశామన్నారు. 
 
ఆపరేషన్ ద్వారా కేన్సర్ ట్యూమర్లను తొలగించిన తర్వాత కొన్ని కేన్సర్ కణాలు మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ కణాలే తిరిగి మళ్లీ ట్యూమర్లుగా పెరుగుతాయి. అందుకే.. ట్యూమర్లను తొలగించాక, మిగిలిపోయే కేన్సర్ కణాలను అన్నింటినీ నాశనం చేసేందుకు కేరళ పసుపు ట్రీట్మెంట్‌ ఉపయోగపడుతుందని సైంటిస్టులు వెల్లడించారు.