శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జూన్ 2024 (11:45 IST)

నరేంద్ర మోడీ 3.0 సర్కారు : తెలంగాణా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు!!

bandi sanjay
కేంద్రంలో కొత్తగా కొలువుదీరనున్న నరేంద్ర మోడీ 3.0 సర్కారులో తెలంగాణ రాష్ట్రానికి ఒకే కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన విషయం తెల్సిందే. ఈ ఎనిమిది మందిలో ఏడుగురు ఎంపీలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
కాగా, గత 2019లో కేవలం నాలుగ సీట్లకు పరిమితమైన బీజేపీ ఈ దఫా 8 సీట్లను దక్కించుకుంది. ఓటింగ్ శాతాన్ని రెండింతలు పెంచుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు తన కేబినెట్లో మోడీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులతో పాటు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలవగా.... ఏడుగురు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా కేంద్రమంత్రి పదవిని ఆశిస్తున్నారు.
 
కానీ, జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు.. తెలంగాణ నుంచి ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు దక్కవచ్చునని భావిస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావులలో ఒకరికి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి ముందున్నారని చెబుతున్నారు. అలాగే, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, డాక్టర్ కె.లక్ష్మణ్‌లో ఇద్దరికి పదవులు రావొచ్చునని భావిస్తున్నారు. ఒక ఎంపీకి జాతీయస్థాయిలో పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.