శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (12:40 IST)

ముహూర్త సమయానికి వధువు ప్రియుడితో.. వరుడు ప్రియురాలితో పరార్

కల్యాణ మండపంలో బంధుమిత్రుల హడావుడి... వరుడు ముస్తాబై వధువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు... అంతలో నాటకీయ ఫక్కీలో వరుడితో తాళి కట్టించుకోవాల్సిన వధువు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోయింది.

కల్యాణ మండపంలో బంధుమిత్రుల హడావుడి... వరుడు ముస్తాబై వధువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు... అంతలో నాటకీయ ఫక్కీలో వరుడితో తాళి కట్టించుకోవాల్సిన వధువు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోయింది. ఆ తర్వాత వధువు చెల్లితో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దీంతో వధువు చెల్లిని పెళ్లి కుమార్తెను చేసి పెళ్లి పీటల వద్దకు తీసుకొచ్చే సమయానికి వరుడు కూడా తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. ఈ తంతు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చన్నకల్లు మాలూర్ పట్టణానికి చెందిన గురేష్ అనే వరుడికి సౌమ్య అనే వధువుకు వివాహం నిశ్చయమైంది. శనివారం రిసెప్షన్ జరిపి, ఆదివారం పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. బంధుమిత్రులు, ఇరు వర్గాల పెళ్లివారు పెళ్లిని వైభవంగా జరిపించేందుకు సిద్ధమయ్యారు. 
 
అయితే, వివాహ ముహూర్తానికి సమయం మించిపోతున్నా పెళ్లి కూతురు మండపానికి రాలేదు. ఆమె తన ప్రియుడితో లేచి పోయినట్టు తేలింది. దీంతో వరుడి తరపు బంధువులు ఆగ్రహించగా, పెద్దలు సర్ది చెప్పి, సౌమ్య బాబాయి కుమార్తె వెంకటరత్నమ్మతో గురేష్ పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. నిశ్చితార్థాన్ని అప్పటికప్పుడు ముగించేశారు. 
 
మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి వుండగా, షేవింగ్ చేయించుకుని వస్తానని బయటకు వెళ్లిన గురేష్ తిరిగి రాలేదు సరికదా... తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేశాడు. తీరా ఆరా తీయగా, తాను ప్రేమించిన అమ్మాయితో పారిపోయినట్టు తేలింది. 
 
మొత్తం మీద పెళ్లి కాస్తా జరగక పోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు వెళ్లిపోవడంతో పెళ్లి వేడుక కాస్తా ఖాళీగా దర్శనమిచ్చింది. వధూవరులు పారిపోయిన ఘటనలు బెంగళూరులో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి చేసుకోవాల్సిన వధూవరులిద్దరూ పారిపోయి బంధుమిత్రులకు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చారు.