బ్యాంకు మోసం కేసులో కమల్‌నాథ్ మేనల్లుడి అరెస్టు.. స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం
బ్యాంకును మోసం చేసిన కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మంగళవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. అక్రమంగా బ్యాంకుల వద్ద సుమారు 354 కోట్ల రూపాయల మేరకు రుణం తీసుకున్న కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
డిజిటల్ డేటా స్టోరేజీ కంపెనీ మాజీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ అయిన రతుల్ సెంట్రల్‌బ్యాంకులో రూ.354కోట్లు అప్పుతీసుకొని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్లు విచారణ జరుపుతున్నాయి. రతుల్‌తో పాటు ఆయన తండ్రి దీపక్ పూరి, తల్లి నీతా(కమల్‌నాథ్ సోదరి), మరికొందరిపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు ఫైల్ చేసింది.
తన మేనల్లుడి అరెస్టుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్‌నాథ్ స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మేనల్లుడు రతుల్ పూరి అరెస్టు విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇన్విస్టిగేషన్ సంస్థలు తమ పని తాము నిజాయితీగా చేసుకోవచ్చన్నారు.