అంబులెన్స్‌కు నిప్పంటించిన దుండగులు.. ముగ్గురి సజీవదహనం!
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు, ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు తెగల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా ఈ రాష్ట్రం ఘర్షణలతో అట్టుడికిపోతుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక హృదయ విదారక ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి, వారి బంధువు నిండు ప్రాణాలను బలిగొన్నారు.
పశ్చిమ ఇంఫాల్‌లోని ఇరోసింబా ప్రాంతంలోని ఓ శరణార్థుల శిబిరం సమీపంలో ఆదివారం మెయితీ - కుకీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ బులెట్ వచ్చి బాలుడు తాన్సింగ్ (8) తలలోకి దూసుకెళ్లింది. దీంతో హుటాహుటిన సిబ్బంది.. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్లోకి ఎక్కించారు.
తోడుగా బాలుడి తల్లి మీనా, లైడియా అనే వారి బంధువు వాహనంలోకి ఎక్కారు. అంబులెన్స్ ఆస్పత్రికి వెళుతుండగా ఓ దుండగుల మూక అడ్డుకొని ఆ వాహనానికి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దహనమైంది. డ్రైవర్ తప్పించుకోగా.. వాహనంలో బాలుడు, అతడి తల్లి, వారి బంధువు సజీవ దహనమయ్యారు.