మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (22:20 IST)

మణిపూర్‌లో చల్లారని ఆగ్రహ జ్వాలలు : మరో నిందితుడి నివాసానికి నిప్పు

Burn Down House
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇద్దరు మహిళల పట్ల జరిగిన అమానుష ఘటన దేశ వ్యాప్తంగా పెను దుమారం చెలరేగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరచంగా నిందితులకు 11 రోజులు పోలీసు కస్టడీ విధించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఇప్పటికే ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పుపెట్టగా.. తాజాగా మరొకరి ఇంటిని ధ్వంసం చేశారు. థౌబల్‌ జిల్లాకు చెందిన ఆ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
 
ఈ ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు సీఎం బీరేన్‌ సింగ్‌ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రజలు మహిళలను తమ తల్లిలా భావిస్తారని.. కానీ, ఈ ఘటనతో నిందితులు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని పేర్కొన్నారు. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 
 
మరోవైపు.. మణిపూర్‌ అల్లర్ల క్రమంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్లు గత నెలలోనే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు అందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులు అందిన విషయాన్ని ధ్రువీకరించిన ఎన్‌సీడబ్ల్యూ చీఫ్‌ రేఖా శర్మ.. వాటి ప్రామాణికతను తేల్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ అటువైపు నుంచి స్పందన లేకుండా పోయిందని నిర్వేదం వ్యక్తం చేశారు.