గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:51 IST)

ఎమ్మెల్యేలకు గృహాలు అద్దెకివ్వమంటున్న ముంబై వాసులు

దేశ ఆర్థిక రాజధానిలో ప్రజాప్రతినిధులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు ముంబై వాసులు ససేమిరా అంటున్నారు. ఇళ్లు అద్దెకు కావాలంటూ ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చినా ముంబై ఫ్లాట్ల యజమానుల్లో ఏ ఒక్కరూ క

దేశ ఆర్థిక రాజధానిలో ప్రజాప్రతినిధులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు ముంబై వాసులు ససేమిరా అంటున్నారు. ఇళ్లు అద్దెకు కావాలంటూ ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చినా ముంబై ఫ్లాట్ల యజమానుల్లో ఏ ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.
 
అసలు విషయమేమిటంటే... ముంబైలోని ప్రముఖ నారిమన్ పాయింట్ ప్రాంతంలో 1994లో శరద్‌పవార్ ప్రభుత్వం రెండుటవర్లు, 1995లో మనోహర్ జోషి ప్రభుత్వం మరో రెండుటవర్లను ఎమ్మెల్యేల కోసం నిర్మించాయి. దీంతో నాలుగు టవర్లలో 336 ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. 
 
ఎమ్మెల్యే సతీశ్‌పాటిల్‌కు కేటాయించిన ఫ్లాట్‌లో ఆగస్టు మొదటివారంలో సీలింగ్ ఊడి కిందపడిపోయింది. దీంతో శిథిలావస్థకు చేరిన భవన సముదాయాలను కూల్చివేసి వీటి స్థానంలో కొత్తటవర్లు నిర్మించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ కారణంగా ఎమ్మెల్యేలంతా తమ ఫ్లాట్లను ఖాళీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ చేశారు. 
 
అదేసమయంలో నారిమన్ పాయింట్ నుంచి దాదార్ ప్రాంతం వరకు 450-500 గజాల విస్తీర్ణంతో కూడిన ఒక పడక, రెండు పడకల గదుల గృహాలు అద్దెకు కావాలంటూ ప్రకటనలు ఇచ్చారు. కానీ, ఒక్కరంటే ఒక్క యజమాని కూడా ఇళ్లు అద్దెకిస్తామని ముందుకు రాలేదు. అంటే, ప్రభుత్వానికి ఫ్లాట్లు కిరాయికి ఇచ్చేందుకు భవనాల యజమానులు ఆసక్తి చూపడం లేదని తేలిపోయింది.