శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (14:39 IST)

ఉరిపై కొత్త ట్విస్ట్ : అది తేలేవరకు ఉరితీయలేమంటున్న ఢిల్లీ సర్కారు

నిర్భయ కేసులో ముద్దాయిలకు అమలు చేయాల్సిన ఉరిశిక్షలపై సరికొత్త ట్విట్స్ చోటుచేసుకుంది. నలుగురు నిందితుల్లో ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. అది తేలేవరకు దోషులకు ఉరిశిక్షలను అమలు చేయలేమని ఢిల్లీ సర్కారు కోర్టుకు విన్నవించింది. దీంతో ఈనెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు అమలు చేయాల్సిన ఉరిశిక్షల అమలుపై సందేహం నెలకొంది. 
 
ఈ దోషులకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఇటీవల ఢిల్లీ పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీచేసింది. అయితే, ఇద్దరు ముద్దాయిలు తమ శిక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో దోషులకు ఉరి అమలు తథ్యమని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ముద్దాయిల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇది ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. 
 
ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం హత్య కేసులో ఓ దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం విన్నవించింది. జైలు నిబంధనల ప్రకారం ఉరిశిక్ష పడిన కేసులో దోషుల మెర్సీ పిటిషన్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందని, అందుకే శిక్షను అమలు చేయలేమని తేల్చి చెప్పింది. నిందితుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు ఉరి తీయలేమని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.