మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (18:23 IST)

పాకిస్థాన్ వక్రబుద్ధి : ప్రధాని మోడీ విమానానికి పర్మిషన్ నిరాకరణ

పాకిస్థాన్ మరోమారు వక్రబుద్ధిని బయటపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం పాకిస్థాన్ గగనతలంపై ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో ప్రధాని మోడీ సౌదీ పర్యటన కోసం పాక్ గగనతలం మీదుగా కాకుండా మరో మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. 
 
జమ్మూకాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై విద్వేషంతో పాకిస్థాన్ రగలిపోతున్న విషయం తెల్సిందే. జమ్మూకాశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన నేటికీ ఆగలేదని పాక్ ఆరోపిస్తోంది. 
 
 ప్రధాని మోదీ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోడీ సౌదీ అరేబియా పర్యటన కోసం అనుమతి ఇవ్వాలని భారత అధికారులు పాకిస్థాన్ సర్కారును కోరారు. అయితే, భారత అధికారుల విజ్ఞప్తిని పాక్ తిరస్కరించింది. 
 
గత నెలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా పాక్ ఇలాగే అనుమతించలేదు. కాగా, మోడీ విమానానికి అనుమతి నిరాకరణపై తమ వైఖరిని భారత హైకమిషనర్‌కు తెలియజేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ ప్రకటనలో వెల్లడించారు.