బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 మే 2018 (18:44 IST)

బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకంకావాలి : ఉద్ధవ్ ఠాక్రే

ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపు

ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.
 
గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ, మన దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌లోనూ అవినీతి కనపడుతోందని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించడం ఆపేసి, ఓట్ల పద్ధతిలో ఎన్నుకుంటే బాగుంటుందన్నారు. 
 
ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని, ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలని అన్నారు. తమ రాష్ట్రంలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల కౌంటింగ్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, ఎందుకు అలా జరుగుతోందో తెలిసే వరకు ఫలితాలు వెల్లడించకూడదని డిమాండ్‌ చేశారు. 
 
కాగా, ఎన్నికల ఫలితాలను వెల్లడించకూడదని శివసేన చేసిన డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పాల్ఘర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిట్‌ గెలిచినట్లు ప్రకటించి ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందజేసింది.