గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 4 ఆగస్టు 2017 (06:08 IST)

మీరు నాకు పితృసమానులు.. మోదీ లేఖతో ప్రణబ్ ఫిదా

దేశ చరిత్రలో రెండు భిన్న మార్గాలు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలను నమ్మిన ఇద్దరు అత్యున్నత రాజ్యాంగ పదవులను పొందితే వారిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. ప్రతి రోజూ ఘర్షణపూరితంగానే ఉంటాయని ఎవరికయినా అనిపిస్తుంది. కానీ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన వ

దేశ చరిత్రలో రెండు భిన్న మార్గాలు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలను నమ్మిన ఇద్దరు అత్యున్నత రాజ్యాంగ పదవులను పొందితే వారిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. ప్రతి రోజూ ఘర్షణపూరితంగానే ఉంటాయని ఎవరికయినా అనిపిస్తుంది. కానీ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన వ్యక్తి చివరి రోజు పదవిని వీడి వెళ్లిపోతున్నప్పుడు మరో అత్యున్నత పదివిలో ఉన్న భిన్న మార్గ నేత స్పందన ఎలా ఉంటుంది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే మోదీలా ఉంటుందని చెప్పవచ్చు.
 
ప్రధానమంత్రి నిర్ణయాలను, ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎన్నోసార్లు ఖండించిన అనుభవం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీది. అయినా ఆయన పదవీవిరమణ రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖ ప్రణబ్ హృదయాన్ని కదిలించింది. ఆ లేఖను తన జ్ఞాపకాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రణబ్ బహిరంగ పర్చారు. మీరు నాకు తండ్రిలాంటి వారు. గొప్ప మార్గదర్శకులు అంటూ ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేసిన చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఉద్వేగభరితమైన లేఖ రాశారు. ఇప్పుడా లేఖ వైరల్ అయింది.
 
‘‘మూడేళ్ల క్రితం నేను ఢిల్లీకి ఒక స్థానికేతరునిగా వచ్చాను. అప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం చాలా పెద్దది.. సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి సమయంలో మీరు నాకు పితృ సమానులుగా.. మార్గదర్శకునిగా ఉన్నారు. మీ జ్ఞానం, మార్గనిర్దేశనం, వాత్సల్యం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇచ్చాయి.  మీ మేధాశక్తి నాకు నిరంతరం మేలు చేసింది. మీరు నాపై ఎంతో ప్రేమ, వాత్సల్యం, శ్రద్ధ చూపారు. వరుస సమావేశాలు, పర్యటనలతో గడిపే నాకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెపుతూ మీరు చేసిన ఒక ఫోన్‌ కాల్‌ నాకు ఎంతో శక్తిని ఇచ్చేది. మన పార్టీలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు వేర్వేరు. మన అనుభవాల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. నా పాలనా అనుభవం అంతా నా రాష్ట్రం నుంచి పొందిందే. కానీ మీరు జాతీయ రాజకీయాలు, విధానాల్లో ఎంతో ముందున్నారు. సమాజానికి సేవ చేయాలనే తలంపుకలిగిన తరం నుంచి వచ్చిన నాయకులు మీరు. మీరు దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత. నిస్వార్థ ప్రజాసేవకునిగా, అసాధారణమైన నాయకునిగా మిమ్మల్ని చూసి దేశం ఎప్పుడూ గర్విస్తుంది. మీరు అందించిన స్ఫూర్తి మాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశనం చేస్తుంది. రాష్ట్రపతి జీ.. ప్రధానమంత్రిగా మీతో కలసి పనిచేయడం నాకు ఎంతో గౌరవం’’అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
జూలై 24న రాష్ట్రపతి బాధ్యతల నుంచి ప్రణబ్‌ తప్పుకోవడానికి ముందురోజు ఈ లేఖను మోదీ రాశారు. కాగా, ప్రధాని లేఖ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చూపించిన గౌరవాన్ని తెలిపిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు.