మానవ మృగాలపై దయ చూపొద్దు : రాష్ట్రపతి రాంనాథ్
ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాల పట్ల దయ చూపాపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. పైగా, ఇలాంటి వారు క్షమాభిక్షకు అనర్హులనీ, అలాంటివారికి క్షమాభిక్ష ప్రసాదించబోమని స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లోని సిరోహిలో జరిగిన బ్రహ్మకుమారీస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయమని, అత్యాచార కేసుల్లో దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండొద్దని అన్నారు. పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్ధారించబడిన వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని, క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలని సూచించారు.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రపతి వ్యాఖ్యలతో నిర్భయ నిందితులకు కూడా క్షమాభిక్ష దొరికే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చినట్టైంది.
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలం వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు ఆయుధాలు లాక్కుని పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.