చెన్నై రైల్వే స్టేషన్‌లో విద్యార్థినిపై అత్యాచారం యత్నం.. ప్రియుడుని బయటకు పంపించి...
చెన్నై నగరంలోని ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది కూడా ఆ స్టేషన్‌లోని బుక్కింగ్ కౌంటర్ క్లర్క్, లిఫ్టు ఆపరేటర్లు కావడం గమనార్హం. ఆ విద్యార్థిని ప్రియుడిని బలవంతంగా స్టేషన్ బయటకు పంపించి... యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కేరళకు చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమెకు నగరానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ సాయంత్రం వేళల్లో స్థానిక తరమణిలోని ఎంఆర్ఎటీఎస్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 10.30 గంటల వరకు కూర్చొని మాట్లాడుకునేవారు. ఈ తంతు గత కొన్ని రోజులుగా సాగుతోంది.
వీరిద్దరినీ టిక్కెట్ బుకింగ్ క్లర్క్ లోకేశ్వరన్ (22), లిఫ్టు ఆపరేటర్లు లూకాస్, శ్రీరామ్‌లు గత కొన్ని రోజులుగా గమనిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పెద్దగా లేరు. ఆ సమయంలో ప్రేమికులిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అపుడు లోకేశ్వరన్, లూకాస్, శ్రీరామ్‌లు వారివద్దకు వచ్చి రాత్రి 10.30 గంటల వరకు ఇక్కడ ఏం పని అంటూ నిలదీశారు.
ఆ తర్వాత యువకుడిని బలవంతంగా బయటకు పంపించి, విచారణ పేరుతో యువతిని రైల్వే స్టేషన్ మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి రూ.5 వేలు అపరాధం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం తన వద్ద లేదని ఆ యువతి చెప్పడంతో కోర్కె తీర్చమని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో ముగ్గురు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.
ఈ కామాంధుల నుంచి తప్పించుకుని బిగ్గరగా అరుస్తూ స్టేషన్ కిందికి దిగివచ్చి, విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు చెప్పింది. ఆయన తిరువాన్మియూరు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అత్యాచార యత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు.