గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2024 (11:01 IST)

భారత్, రష్యా మధ్య స్నేహబంధం సముద్రం కంటే లోతైనది : రాజ్‌నాథ్ సింగ్

rajnath singh
భారత రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఆ దేశ రక్షణ శాఖామంత్రి అండ్రీ బెలోవ్సన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ద్వౌపాక్షిక, రక్షణ సంబంధాలపై చర్చించారు. భారత్ - రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలటరీ టెక్నికల్ కో ఆపరేషన్‌పైనా ఫలవంతమైన చర్చలు జరిగినట్లు రాజ్‌నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ - రష్యాల బంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కంటే లోతైనదని అన్నారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందన్నారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలపై కూలంకషంగా చర్చించామని, రెండు దేశాలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
కాగా, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్ఠమయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయని వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ తాజా పర్యటన నేపథ్యంలో రష్యాలోని భారత దౌత్య కార్యాలయం స్పందిస్తూ, భారత్ - రష్యా సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని వెల్లడించింది. కాగా, ఈ పర్యటనలో ఆయన రష్యా అధినేత వ్లాదిమిరి పుతిన్‌తో సమావేశమయ్యారు.