రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం... సుప్రీం తలుపుతట్టనున్న సచిన్ పైలట్?
రాజస్థాన్ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పూనుకున్న యువనేత, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్‌పై ఇప్పటికే బహిష్కరణ వేటు వేసిన కాంగ్రెస్ హైకమాండ్.. ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైంది.
ఇందులోభాగంగా, పైలట్ వర్గానికి చెందిన 19 మంది శాసన సభ్యులకు స్పీకర్ జోషి నోటీసులు జారీ చేశారు. ఈ 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో స్పీకర్ నోటీసులిచ్చారు. ఇప్పుడు ఇదే విషయంపై ఫైర్‌బ్రాండ్ పైలట్ సుప్రీం కోర్టు తలుపులు తట్టనున్నట్లు సమాచారం.
ఈ విషయంపై తన సొంత లాయర్లతో తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు ఏ విధమైన చట్టబద్ధత లేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే స్పీకర్ నోటీసులు జారీ చేశారన్న వాదనతో ఆయన సుప్రీం మెట్లెక్కనున్నారు. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఓ క్లారిటీ తీసుకోనున్నట్లు తెలిసింది.
సోమ, మంగళ వారాల్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశాలకు సచిన్ పైలట్‌తో పాటు 19మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో వీరంతా పార్టీ విప్‌ను ధిక్కరించారు. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఈ 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ చీఫ్ విప్ మహేశ్ జోషి స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే 19 మందికి స్పీకర్ నోటీసులిచ్చారు.