భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ... ముగ్గురి కాల్చివేత
ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఓ పోలీసు ముగ్గురు సహచరులను కాల్చిచంపారు. చనిపోయిన ముగ్గురు సిక్కిం పోలీస్ విభాగానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు ప్రబీణ్ రాయ్ (32) ఢిల్లీ పోలీస్ స్టేషనులో లొంగిపోయాడు. నిందితుడుతో పాటు ముగ్గురు మృతులు ఇండియన్ రిజర్వు బెటాలియన్‌లో భాగమైన వీరు ఢిల్లీలోని హైదర్‌పుర్ వాటర్ ప్లాంట్ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్నుట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై డీసీపీ ప్రణవ్ తయాల్ స్పందిస్తూ, 'సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేఎన్‌కే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. కాల్పులకు గురైన పోలీసులలో ఇద్దరు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని బీఎస్‌ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు' అని వివరించారు.
'తన భార్య గురించి తోటి ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిందితుడు ప్రాథమిక విచారణలో చెప్పాడు. తద్వారా తనను మానసిక వేధింపులకు గురిచేశారని వెల్లడించాడు' అని స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ రాయ్ తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు ప్రబీణ్ సమయ్‌పుర్ బద్లీ స్టేషన్‌లో లొంగిపోయినట్లు వివరించారు.