కేరళను ముందే తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈ దఫా నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ముందే తాకనున్నాయి. అదీ కూడా ఈ నెల 25వ తేదీ తర్వాత ఎపుడైనా కేరళలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల్లో కేరళ, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నిన్ననే నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు పేర్కొంది. అదేవిధంగా గత రెండు మూడు రోజులుగా కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
వచ్చే ఐదు రోజులుగా ఈ రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ తర్వాత ఎపుడైనా రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకొచ్చని పేర్కొన్నారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.