శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (07:52 IST)

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌.. రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌కు చెందిన ప్రతినిధి దర్శన్‌ పాల్‌ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ట్రాక్టర్‌ ర్యాలీ తలపెట్టిన వేళ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించడం గమనార్హం.
 
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దర్శన్‌ చెప్పారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ వైపు వివిధ మార్గాల నుంచి కాలినడకన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. నేటి ట్రాక్టర్‌ ర్యాలీతో రైతుల సామర్థ్యం ఏంటో ప్రభుత్వానికి తెలిసొస్తుందని చెప్పారు. తాము చేపట్టబోయే ప్రదర్శనలు, ఆందోళనలు శాంతియుతంగా జరుగతాయని స్పష్టంచేశారు.