గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (11:08 IST)

సుప్రీంకోర్టు చెబితే పాటించాల్సిందే.. అది పార్లమెంట్ చేసిన చట్టం : కపిల్ సిబల్

పార్లమెంట్ చేసిన చట్టాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిందేనని, ఈ మాట సుప్రీంకోర్టు చెబితే పాటించక తప్పదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ఆయన కోళికోడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు చేసిన చట్టాలను తాము అనుసరించలేమని చెప్పడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కష్టమేనన్నారు. 
 
సీఏఏ, ఎన్నార్సీలు తమకు ఆమోదయోగ్యం కావని పలు రాష్ట్రాలు చెబుతున్నాయని అన్నారు. కానీ, ఎన్నార్సీ అనేది ఎన్పీఆర్ (జాతీయ పౌర జాబితా) మీద ఆధారపడి ఉంటుందని... దీన్ని రాష్ట్ర స్థాయి అధికారులు నియమించిన స్థానిక రిజిస్ట్రార్ చేస్తారని తెలిపారు. కేరళలోని కోజికోడ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఎన్నార్సీకి సహకరించబోమని చెప్పడమంటే... కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధికారులు సహకరించరని చెప్పడమేనని... ఇది అంత సులభమైన పని కాదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని... కాదని చెప్పడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు.
 
సీఏఏ అనేది జాతీయ అంశమని... దీన్ని జాతీయ స్థాయిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సిబాల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని చూడరాదని... కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని అన్నారు.
 
సీఏఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. సీఏఏను విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగబద్దమైన హక్కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని చెప్పారు. సీఏఏ రాజ్యాంగబద్దమైనదేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం... దాన్ని వ్యతిరేకించడం అసాధ్యమవుతుందని అన్నారు.