శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (09:16 IST)

మారటోరియంపై సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది: కేంద్రంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

రెండు కోట్ల రూపాయల లోపు బ్యాంకు రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీని జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రుణాలకు వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేసేందుకు నెల ఆలస్యం ఎందుకంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.
 
తీసుకున్న నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, చిన్నచిన్న మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరేలా, అన్ని నియమనిబంధనలకు అనుగుణంగా, నిర్ణయాలు తీసుకునేందుకు సమయం కావాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కేంద్రం వాదనలతో ఏకీభవించని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
 
రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులు ఉంటాయని, బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు 
సొలిసినటరీ జనరల్‌ కోర్టుకు సమాధానం ఇవ్వగా కేంద్ర నిర్ణయం అమలుపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని వుందని, “సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి జస్టిస్ ఎమ్.ఆర్. షా వ్యాఖ్యానించారు.
 
నవంబరు 15వరకు సమయం ఇవ్వాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరినా, నవంబరు 2ను డెడ్‌లైన్‌గా సుప్రీం ధర్మాసనం చెప్పింది.