శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:02 IST)

పెట్రోల్‌పై రూ.3 పన్ను తగ్గించిన తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది వినియోగదారులకు మేలు చేసేలా పెట్రోల్‌పై భారాన్ని రూ.3 మేరకు తగ్గించింది. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నును మూడు రూపాయల మేరకు తగ్గించింది. 
 
గత ఏప్రిల్ నెలలో సీఎం స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఎన్నికల కోసం డీఎంకే ప్రకటించి మేనిఫెస్టోలో పెట్రోల్‌ లీటరుపై రూ.5 తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఇందులోభాగంగా, తొలుత రూ.3 మేరకు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఈ తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, డీజిల్‌పై మాత్రం ఎలాంటి ఊరటా ఇవ్వలేదు.
 
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏటా రూ.1,160 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ప్రస్తుతం చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.102 ఉండగా.. డీజిల్‌ ధర రూ.94.39 ఉంది. ఆగస్టు 14 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి. 
 
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పన్నులు తగ్గించేలా ఈ నిర్ణయం ప్రభావితం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు సహా 19 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర ఇప్పటికే సెంచరీ దాటింది.
 
పెట్రోల్‌పై పన్ను తగ్గించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా పలు కీలక నిర్ణయాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మాతృత్వ సెలవులను 9 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌ వంటి పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది.