శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 12 అక్టోబరు 2019 (18:26 IST)

క‌మొరోస్ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్న ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య, ఇంత‌కీ.. ఆయ‌న ఏం చేసారు?

భార‌త ఉపరాష్ట్ర‌ప‌తి ప‌ద‌వితో తెలుగు వారంద‌రూ గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడు అనిపించుకున్న వెంక‌య్య నాయుడు క‌మొరోస్ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్నారు. ఎంత‌లా అంటే.. ఆయ‌న్ని తమ సహోదరునిగా గౌరవించుకునేంత. అవును.. అక్క‌డ అంత గౌర‌వం ల‌భించింది. ఇంత‌కీ.. వెంక‌య్య నాయుడు క‌మొరోస్ ప‌ర్య‌ట‌న ఎలా జ‌రిగిదంటే... కమొరోస్ రాష్ట్రపతి అజాలి అస్సౌమని, ఆయనతో పాటు ఆయన కాబినెట్ సభ్యులందరూ విమానశ్ర‌యానికి వచ్చి సాదరంగా ఆహ్వానించారు.
 
ఈ పర్యటన ఆసాంతం రాష్ట్రపతి అజాలి అస్సౌమని మరియు ఉప రాష్ట్రపతి నాయుడు మధ్య ఒక విశేషమైన సోదరభావం, ఆప్యాయత కొట్టొచ్చినట్టు కనిపించింది. గౌరవ ఉప రాష్ట్రపతి నాయుడు, కమొరోస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం "ది కమాండర్ అఫ్ ది గ్రీన్ క్రెసెంట్" ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంట్‌కు ఆహ్వానించి, ఒక ప్రత్యేక సభా సమావేశానికి ఉపరాష్ట్రపతితో ప్రసంగింప చేసి ఒక అరుదైన గౌరవానికి నాంది పలికారు. 
 
వెంక‌య్య నాయుడు కమొరోస్ దీవులని సందర్శించిన మొదటి భారత నాయకులయ్యారు. హిందూ మహాసముద్రాన్ని ఒక స్నేహ సముద్రంగా అభివర్ణించి కమొరోస్ ప్రజలను ఆకట్టుకోవటమే కాక, సముద్రానికి పర్యాయపదాలలో ఒక కొత్త దృక్కోణానికి తెరలేపారు. వెంకయ్య నాయుడు ప్రసంగం ఆసాంతం కమోరియాన్ పార్లమెంట్ చప్పట్లతో మార్మోగిపోయింది. ఎన్నోసార్లు పార్లమెంటు సభ్యులంతా తమ స్థానాలనుంచి లేచి నిలబడి కరతాళ ధ్వనుల ద్వారా తమ అభిప్రాయాన్ని అనేకమార్లు బాహాటంగా తెలియజేసారు. 
 
ఈ ప్రసంగాన్ని కమొరోస్ దేశ టీవీ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కమొరోస్ వారి జాతీయ గీతాన్నుంచి ఉపరాష్ట్రపతి సందర్భోచితంగా వాడిన ఒక వాక్యం అక్కడి ప్రజల మనసులలో నాయుడుకై ఒక సుస్థిర గౌరవప్రద స్థానాన్నిచ్చింది. వెంకయ్య నాయుడు పర్యటన వలన కమొరోస్ దీవులు భారతదేశ వాసులకే కాక ప్రపంచ దేశాలన్నిటి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నాయి. ఈ పర్యటన వలన కమొరోస్ దీవులకు భారతదేశానికి మధ్య ఒక వారధి ఏర్పడి మన దేశ ఔన్నత్యంపై ఆఫ్రికావాసుల హృదయాలలో విశేషమైన స్థానం లభించింది. 
 
వెంకయ్య నాయుడు "వసుధైవ కుటుంబకం" అన్న నానుడిని పరిచయం చేసిన తీరుకి అక్కడివారి నుంచి అద్భుత ప్రతిస్పందన లభించింది. ఆయ‌న ఆరు కీలకమైన ఒప్పందాలపై సంతకాలు చేశారు. (దేశ) రక్షణ, ఆరోగ్యం, టెలి-మెడిసిన్, దూరవిద్య, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక వ్యవహారాలు... ఇంకా దౌత్య మరియు అధికారిక ప్రయాణాలకై వీసా లేకుండా ఇరు దేశాల మధ్య ప్రయాణం చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ చారిత్రాత్మక పర్యటనతో గౌరవ ఉప రాష్ట్రపతి కొమొరోస్ ప్రజల మనసులలో భారతీయులకై అద్వితీయ స్థానం సంపాదించి, ఒక సువర్ణాధ్యాయానికి అంకురార్పణ చేసారు.