శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (16:35 IST)

ఆ ఒక్కటితప్ప జయలలిత అధికారాలన్నీ నమ్మినబంటుకే...

ఒక్క పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మినహా ముఖ్యమంత్రి దివంగత జయలలితకు ఉన్న అధికారాలన్నీ ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వానికే అప్పగించారు.

ఒక్క పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మినహా ముఖ్యమంత్రి దివంగత జయలలితకు ఉన్న అధికారాలన్నీ ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వానికే అప్పగించారు. ఈ మేరకు మంగళవారం చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి అప్పగించారు. అదేసమయంలో ఆ పార్టీ నుంచి శశికళతో పాటు.. టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. 
 
అన్నాడీఎంకే సర్వోన్నత పదవి జనరల్ సెక్రటరీ స్థానాన్ని శాశ్వతంగా జయలలిత పేరుమీదనే ఉంచాలని నిర్ణయించారు. జయలలిత నియమించిన పార్టీ ఆఫీస్ బేరర్లను యధాతథంగా కొనాసాగించాలని తీర్మానించారు. తాత్కాలిక జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేశారు. దీంతో ఆ స్థానంలో కొనసాగుతున్న శశికళను పక్కనబెట్టినట్టయింది. టీటీవీ దినకరన్ హయాంలో చేసిన అన్నీ తీర్మానాలు, ప్రకటనలను రద్దు చేశారు. వాటికీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తీర్మానంలో స్పష్టంచేశారు.
 
ఈ చర్యతో శశికళ వర్గానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జయలలిత నమ్మిన బంటు పన్నీర్‌సెల్వం తన పంతం నెగ్గించుకున్నారు. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం సారథ్యంలో నిర్వహించిన జనరల్ కౌన్సిల్ సమావేశానికి పార్టీలోని మొత్తం 98 శాతానికి పైగా నేతలు హాజరయ్యారు. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు మినహా మిగిలిన నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు.