శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (18:48 IST)

భర్తతో మనస్పర్థలు.. వేరొక వ్యక్తితో సహజీవనం.. చివరికి ఏమైందంటే?

ఓ మహిళకు భర్తతో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని వేరుగా సహజీవనం చేస్తోంది. అయితే ప్రియుడు ఆ పిల్లలను సరిగ్గా చూసుకునే వాడు కాదు. నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఏడేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు.


ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్రాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఎర్నాకుళంలోని కులెచెరీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల మహిళకు ఇద్దరు కొడుకులున్నారు. ఓ కొడుకు వయసు ఏడేళ్లు కాగా చిన్నోడి వయసు నాలుగేళ్లు. 
 
అయితే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా అతనితో వేరుపడి, 36 ఏళ్ల వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే ప్రియురాలి పుత్రులంటే అతనికి ఇష్టం ఉండేది కాదు. తల్లి ఉన్నప్పుడు వారిని ఎంతో ప్రేమగా చూస్తున్నట్లు నటించి, ఆమె లేని సమయంలో పిల్లలను కొడుతూ, తిడుతూ చిత్రవధ చేసేవాడు. వారు ఆ బాధలను భరిస్తూ మౌనంగా ఉండే వాళ్లు. 
 
అతడు తాజాగా ఓ చిన్న విషయమై 4 ఏళ్ల చిన్నోడిని కొడుతూ వేధించడం మొదలెట్టాడు. తమ్ముడిని కొట్టడం భరించలేని ఏడేళ్ల అన్న అడ్డుపడ్డాడు. అంతే తనకు అడ్డుగా వచ్చిన బాలుడిపై అతి క్రూరంగా దాడి చేసాడు. క్రింద పడి గాయమైనా పట్టించుకోలేదు. రక్తం ధారగా కారుతున్నా ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. పైగా తమ్ముడిని చితకబాదాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి హాయిగా పడుకున్నాడు. 
 
కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన తల్లి, కొడుకును గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తలకు దెబ్బ బలంగా తగలడం వల్ల పుర్రెకు పగులు వచ్చిందని తెలిపారు. గుండెల మీద కూడా తీవ్రంగా కొట్టడంతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. శరీరంలోపల రక్తనాళాలు చిట్లడం వల్ల మెదడుకు రక్తసరఫరా ఆగిపోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. 
 
వైద్యుల నుంచి సమాచారం అందుకున్న చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం చిన్నారిని ఎర్నాకుళం ఆసుపత్రికి తరలించారు. బాలుడి తమ్ముడి నుంచి ఏం జరిగిందో తెలుసుకున్న పోలీసులు పిల్లలపై దాడి చేసి వ్యక్తి కోసం గాలిస్తున్నారు.