మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:34 IST)

రొయ్యలు-కోడిగుడ్లు ఫ్రై.. ఎలా చేయాలో తెలుసా?

మాంసాహార ప్రియులు పచ్చిరొయ్యలను అమితంగా ఇష్టపడతారు. చికెన్, మటన్లతో పోలిస్తే పచ్చిరొయ్యలు, గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి అనే విషయం మనందరికి తెలిసిందే. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చిరొయ్యలు, గుడ్లు కలిపి రుచికరమైన కూర చేసుకుంటే ఇంట్లోని వారందరూ ఆత్రంగా తినాల్సిందే.
 
కావలసిన పదార్థాలు:
గుడ్లు : ఆరు,
పచ్చిరొయ్యలు : పావుకేజీ, 
ఉల్లిపాయలు : మూడు,
పచ్చిమిర్చి : మూడు, 
కారం : టీ స్పూన్,
ఉప్పు : తగినంత, 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్,
గరం మసాలా : అర టీ స్పూన్, 
చింతపండు : నిమ్మకాయంత,
కరివేపాకు : రెండు రెమ్మలు,
పసుపు : పావు టీ స్పూన్,
నూనె : మూడు టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర : కొద్దిగా,
టమాటాలు : రెండు,
 
తయారుచేసే విధానం: 
ముందుగా గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. పచ్చిరొయ్యలు లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి. స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి. అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మగ్గిన తరువాత పచ్చిరొయ్యలు వేసి కలిపి ఒక నిముషం మూతపెట్టాలి. ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండురసం, గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఎగ్ విత్ పచ్చిరొయ్యలు కర్రీ రెడీ.