ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (19:23 IST)

కలియుగ రాజులు ఎవరో తెలుసా? రాహు కేతువులు.. వీరు మామూలుగా..?

కలియుగం మనం ప్రస్తుతం వున్న యుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని విశ్వాసం 
 
ఈ కలియుగానికి రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేస్తున్నారు. 
 
నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి. 
 
ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. 
 
ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.
 
ఈ విధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.