శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2016 (19:20 IST)

శ్రీ దుర్మిఖి నామ సంవత్సర పీఠికా ఫలితాలు...

శ్రీ దుర్మిఖి నామ సంవత్సరం గ్రహసంచారాన్ని గమనించగా ఆగస్టు వరకు సింహంలో బృహస్పతి ఆ తదుపరి అంతా కన్య యందు, 2017 జనవరి వరకు వృశ్చికం నందు శని, ఆ తదుపరి అంతా ధనస్సు నందు, ఈ సంవత్సరం అంతా సింహం నందు రాహువు

శ్రీ దుర్మిఖి నామ సంవత్సరం గ్రహసంచారాన్ని గమనించగా ఆగస్టు వరకు సింహంలో బృహస్పతి ఆ తదుపరి అంతా కన్య యందు, 2017 జనవరి వరకు వృశ్చికం నందు శని, ఆ తదుపరి అంతా ధనస్సు నందు, ఈ సంవత్సరం అంతా సింహం నందు రాహువు, కుంభం నందు కేతువు సంచరిస్తారు.
 
ఈ గోచారాన్ని గమనించగా ఈ సంవత్సరానికి శుక్రుడు అధిపతి అవడం వల్ల అధికమైన ఎండలు ఎదుర్కొన్నా నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. ఆగస్టు, అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాల వారు ఆందోళనకు గురవుతారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కొంత జాప్యం ఎదుర్కొన్న సఫలీకృతులౌతారు. అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైనదని గమనించాలి. దేశ, రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య చిన్నచిన్న విభేదాలు తలెత్తినా సమసిపోతాయి. 
 
30-04-2016 చైత్ర బహుళ అష్టమి శనివారం నుండి 12-07-2016 ఆషాఢశుద్ధ అష్టమి వరకు శుక్రమౌఢ్యమి ఉన్నందువల్ల ఇందు శుభకార్యాలు చేయరాదు. పై రాష్ట్రాల్లో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. శిశుమరణాలు అధికం కాగలవు. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొత్తకొత్త అనారోగ్యాల వల్ల ప్రజలు ఇక్కట్లకు లోనవుతారు. భూమి ధరలు అధికం అవుతాయి. కొనుగోలు చేసేవారు తక్కువవుతారు. కంది, మినుము, నూనె, మిర్చి, ధాన్యం, ధరలు అధికం అవుతాయి. 
 
రాష్ట్రంలో విద్యుత్ లోపం వల్ల అప్పుడప్పుడు ప్రజలు ఇబ్బందులకు లోనుకావాల్సి వస్తుంది. దక్షిణ, పశ్చిమభాగ ప్రజలకు జల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. 04-05-2016 చైత్రబహుళ ద్వాదశి బుధవారం నుండి చిన్న కర్తరీ ప్రారంభం అవుతుంది. 11-05-2016 నుండి నిజకర్తరీ ప్రారంభం. 28-05-2016తో కర్తరీ త్యాగం. ఈ కర్తరీలో శంకుస్థాపన వంటివి చేయరాదు. సంగీత, కళాకారులు, అంతరిక్ష పరిశోధకులకు, పండితులకు వారి వారి రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకుని మరణం ఆందోళన కలిగిస్తుంది. చోరుల వల్ల స్త్రీలు అధిక సమస్యలు ఎదుర్కొంటారు. 
 
స్త్రీలకు బలవత్తరమైన మరణాలు జరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్త వహించాలి. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు స్త్రీలు ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని ప్రైవేట్ ఛానల్స్ మూతపడే అవకాశం ఉంది. 11-08-2016 రాత్రి 9.28 నిమిషాలకు గురువు ఉత్తరా నక్షత్రయుక్త కన్యా ప్రవేశం చేయడం ద్వారా కృష్ణానదీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు 12 రోజులు ఉంటాయి. అనగా 23-08-2016 వరకు ఉంటాయి. ఈ పుష్కరాల వల్ల కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో శుభకార్యాలు చేయరాదు. నిరుద్యోగులకు ఒత్తిడి, చికాకు తప్పదు. 
 
పారిశ్రామిక రంగంలో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. పురుష సంతతి అధికం అవుతుంది. వివాహితుల మధ్య అనుకోని సమస్యలు తలెత్తగలవు. 13-09-20136 భాద్రపదశుద్ధ ద్వాదశి మంగళవారం మొదలు 11- 10-2016 ఆశ్వీయుజశుద్ధ దశమి, మంగళవారం వరకు గురుమౌఢ్యమి ఏర్పడినందు వల్ల ఇందు శుభకార్యాలు చేయరాదు. తూర్పు, దక్షిణ భాగం నుండి తుఫాను వంటి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. పడమర, ఉత్తర భాగంలో భూమి స్వల్పంగా కంపిస్తుంది. సినిమా రంగాల్లో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. 
 
విదేశాలు వెళ్ళాలనుకునే విద్యార్థులకు సమస్యలు తలెత్తుతాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు అధికమయ్యే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొంటారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పీఠాధిపతుల మధ్య సమస్యలు తలెత్తగలవు. నాస్తికులతో సమస్యలు ఎదుర్కొంటారు. విదేశీయుల నుండి పెట్టుబడులు బాగుగా లభిస్తాయి. క్రీడారంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆగస్టు నుంచి సత్కాలం అని చెప్పవచ్చును. గ్యాస్, నూనె, పెట్రోలు ధరలు అధికం అవుతాయి. వైద్య రంగాల్లో వారు అపవాదులు ఎదుర్కొనక తప్పదు. చింతపండు, బెల్లం, ఆవాలు, మిరియాల వ్యాపారసస్తులకు పురోభివృద్ధి ఉంటుంది. 
 
చక్కర వ్యాధి, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు ప్రజలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఉపాధ్యాయులలో స్థిరబుద్ధి లోపిస్తుంది. నీటికి సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. టాక్స్ వంటి సమస్యల వల్ల వ్యాపారస్తులు ఒత్తిడికి లోనవుతారు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దేశంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. 14-01-2017న మకర సంక్రమణం జరుగుతుంది. ఈ మకర పురుషుని పేరు ''రాక్షస''. దుర్మిఖినామ సంవత్సర పుష్య బహుళ విదియ, శనివారం, ఆశ్లేషనక్షత్రయుక్త మేషలగ్నము నందు మకరసంక్రమణం జరుగుతుంది. 
 
ఈ మకర పురుషుని పేరు ''రాక్షస'' నామధేయం అవటం వల్ల చండాలరిష్టం, నిర్మలోదకస్నానం వల్ల శుభాలు, పెసలు అక్షితలుగా ధరించడం వల్ల ధాన్యాభివృద్ధి, నీలపు వస్త్రధారణ వల్ల ప్రజలందరు ఆందోళన, భయానికి లోనవుతారు. లక్కగంధంగా ధరించడం వల్ల యుద్ధభయం, విద్రోహక చర్యలు, రక్షకభటులకు రక్షణ కరువవడం వంటివి ఉండగలవు. జపాపుష్పధారణచే యశోహాన్ని, గోమేధికాభరణాన్ని ధరించడం వల్ల పశువులకు హాని, సీసపు పాత్రచేత పుచ్చుకొనుటవల్ల కొత్త కొత్త అనారోగ్యాలు అధికమవుతాయి. పాలు తాగడం వల్ల పశువులకు హాని, ఏనుగు వాహనం అధిరోహించడం వల్ల రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, కళాకారులకు హాని, కోదండం ధరించడం వల్ల భయాందోళనలు అధికం అవుతాయి. 
 
కాంచనఛత్రం వల్ల స్వర్ణాభరణాల నాశనం అగును. ఆగ్నేయదిశలో ప్రయాణించడం వల్ల అగ్నిభయం, రాష్ట్రాల్లో అశాంతి, బలవత్తర మరణాలు, స్త్రీమరణాలు అధికం అవుతాయి. ఆశ్లేష నక్షత్రం అవటం వల్ల కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు వంటివి తలెత్తుతాయి. రాజకీయ నాయకులకు విదేశీయ పర్యటనలు అధికం కాగలవు. రక్షక భటులకు రక్షణ తగ్గుతుంది. ఒక ప్రముఖ దేవాలయం సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరగడం వల్ల బలవత్తర మరణాలు అధికమవుతాయి. వైద్య విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించగలవు. 
 
వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైన అభివృద్ధి ఉండగలదు. పండ్ల, పూల, కూరగాయ వ్యాపారస్తులకు ద్వితీయ భాగం నుండి సంతృప్తి, అభివృద్ధి ఉంటుంది. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మార్కెటింగ్ రంగాల్లో వారికి అధిక కృషి అనంతరం సత్ఫలితాలు లభిస్తాయి. ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయ, సహకారాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు ఈ సంవత్సరం నాందీ పలుకుతారు. విద్యార్థులలో సెల్ ఫోన్ వాడకాలు పెరుగుతాయి. ఫేస్ బుక్‌ల ప్రభావం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందులకు లోనవుతారు. విద్యావిషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఓర్పు, సహనం, ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థుల బలవత్తర మరణాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే ఆస్కారం ఉంది జాగ్రత్త అవసరం. మన భారతదేశంలో గ్రహణాలు ఈ సంవత్సరం కానరావు. అయితే రెండు సూర్యగ్రహణాలు మాత్రం కొన్ని దేశాల్లో కనిపిస్తాయి. 1-9-2016 కంకణాకర సంపూర్ణ సూర్యగ్రహణం, రాహుగ్రస్త ఈ సూర్యగ్రహణం ఆఫ్రికా ఖండంలో అంటార్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో కనిపిస్తుంది. 
 
26-02-2017 మాఘబహుళ అమావాస్య, ఆదివారం, కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ దక్షిణ అమెరికా, అర్జెంటీనా, ఆఫ్రికా ఖండంలో కొంతభాగం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా అధిక, శ్రమ, ఒత్తిడి, చికాకు వంటివి ప్రజలు ఎదుర్కొనక తప్పదు. 20-03-2017 ఫాల్గుణ బహుళ అష్టమి మొదలు 30-03-2017 (హేవళంబినామ సంవత్సర) చైత్రశుద్ధ తదియ వరకు శుక్రమౌఢ్యమి ఉన్నందువల్ల ఇందు శుభకార్యాలు చేయరాదు. ప్రతివారు ఐశ్వర్యప్రదాతయైన ఈశ్వరుని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆవుపాలతో అభిషేకం చేయించడం వల్ల ఆరోగ్యాభివృద్ధి, సంకల్పసిద్ధి, పురోభివృద్ధి చేకూరుతాయి. 
 
రాశి       -    ఆదాయం  -  వ్యయం -  రాజపూజ్యం  - అవమానం 
మేషం     -     02       - 08       - 01             - 07
వృషభం   -     11        - 14        - 04            - 07
మిథునం -      14        - 11        - 07           - 07 
కర్కాటకం -     08        - 11        - 03          - 03
సింహం    -     11         - 05       - 06          - 03 
కన్య      -      14         -11         - 02           - 06 
తుల     -       11        - 14        - 05          - 06
వృశ్చికం -       02       - 08        - 01          - 02 
ధనస్సు -       05        - 14        - 04         - 02
మకరం  -       08         - 08       - 07         -02 
కుంభం -        08         - 08       - 03         -05  
మీనం -         05         - 14       - 06        - 05
 
సర్వేజనా సుఖినోభవస్తు.