సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (18:57 IST)

వరలక్ష్మీదేవి వ్రతంతో సకల శుభాలు.. ఆయురారోగ్యాలు మీ వశం

శ్రావణమాసం అనగానే ముందు గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం. అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. 
 
ముత్తయిదువులు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి, వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు. వరలక్ష్మీదేవి సకల శుభాలను చేకూర్చి, ఆయురారోగ్య, అష్టైశ్వర్య, భోగ భాగ్యాలతో తులతూగేలా తమ కుటుంబాలను చల్లగా చూస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.
 
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి, అభ్యంగన స్నానమాచరించి, ఇంటి ముందు ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి, వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టి, గుమ్మాలకు మంగళ తోరణాలతో అలంకరించి, గడపలను పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మండపాన్ని అరటి పిలకలు పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేస్తారు.
 
వరలక్ష్మీ వ్రతాన్ని చేసే మహిళలు ముందుగా మండపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మండపంలో బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది అందులో కలశాన్ని ఉంచి మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయ నుంచి దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు జాకెట్ ముక్క తో అలంకరించాలి. ఇక అమ్మవారి ముఖాన్ని కలశం పైన అందంగా అమర్చుకోవాలి. 
 
పసుపుతోనైనా, బియ్యంపిండి, మైదా పిండితో గానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోనూ అమ్మవారి విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. లేదంటే అమ్మవారి చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసుకుని పూజించవచ్చు.