పాములా మనిషి పగబడితే ఏమవుతుంది..?
కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పాము ఉన్న ఇంటితో పోల్చాడు కవి తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనస్సులో ఎవరిమీదైనా పగ ఉంటే వారు స్థిమితంగా ఉండలేరు. ఎదుటివారిని స్థిమితంగా ఉండనివ్వరు కూడా. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద తమ బాగోగుల గురించి పట్టించుకోకుండా తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.
పగ నివురుగప్పిన నిప్పులా మనిషిని దహించి వేస్తూ ఉంటుంది. ఎవరి మీదైనా పగబట్టిన వారు వారిని చావు దెబ్బ తీయాలని, సర్వనాశనం చేయాలని ఎదురుచూస్తూ చివరకు తమకు తామే చేటు తెచ్చుకుంటారు. శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ పాము ఎవరిమీదైనా పగబట్టిందో నిర్ణీత గడువులోగా ఆ పగ తీర్చుకోలేకపోతే నోటి ముందుకు వచ్చిన ఆహారాన్ని కూడా తినడం మానేసి ఆకలితో క్రుంగి కృశించి చివరకు తన తలను నేలకేసి కొట్టుకుని చచ్చిపోతుందని అంటారు.
పాము విషయానికి సంబంధించి ఇది నిజమో కాదో పక్కనబెడితే అర్థంపర్థం లేని పగలు, ప్రతీకారాల వల్ల అవతలివారి నిండుప్రాణాలను తీయడానికి ప్రయత్నించడంతో పాటు అవసరమైతే ఏదో ఒకటి చేసుకుంటారు చాలామంది. అందుకే పగను ప్రేమతో, శాంతంతో, క్షమతో తరిమికొట్టాలట. ప్రేమతో సాధించలేనిది ఈ భూమి మీద ఏదీ లేదని మనం గ్రహించాలి. ప్రేమను పంచితే పోయేదేముంది?