శబరిమల ఆలయంలోకి మహిళలా..? అయ్యప్ప స్వామి బ్రహ్మచారి- నాయర్ సొసైటీ

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రాజ్యాంగ నైతికత ఆధారంగా పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శబరిమల అయ్యప్ప బ్రహ్మచర్యాన్ని పరిరక్షించేంద

Selvi| Last Updated: గురువారం, 26 జులై 2018 (10:49 IST)
ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రాజ్యాంగ నైతికత ఆధారంగా పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శబరిమల అయ్యప్ప బ్రహ్మచర్యాన్ని పరిరక్షించేందుకు రాజ్యాంగంలో నిబంధనలున్నాయని సుప్రీంకోర్టుకు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తెలిపింది.
 
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నాయర్ సొసైటీ వ్యతిరేకిస్తుంది. ఈ సంస్థ తరఫు లాయర్‌ కె.పరాశరన్‌ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
ఆలయంలోకి వచ్చేవారు యువతులను, మహిళలను వెంట తీసుకురావద్దని, పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు కూడా వర్తించదని పరాశరన్ స్పష్టం చేశారు. 
 
మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించగా.. ఇలాంటి సంప్రదాయాలను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగపరంగా ఆ దేవుడికి రక్షణ కల్పించాలన్నారు.
 
వందల ఏళ్లుగా ప్రజల విశ్వాసాల ప్రకారమే ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం స్వచ్ఛందంగా అమలవుతోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా పరిశీలించుకోవచ్చునని పరశురామ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న దర్గాలు, మసీదుల్లోకి కూడా మహిళలకు ప్రవేశం లేదు. కొన్ని ఆలయాల్లోకి పురుషులు ప్రవేశించేందుకు వీలులేదు. ఇటువంటి సంప్రదాయాలను, నమ్మకాలను పరీక్షించాలనుకోవటం కొత్త సమస్యలను తెచ్చి పెట్టినట్లవుతుందని కోర్టుకు లాయర్ విన్నవించుకున్నారు. శబరిమల దైవం బ్రహ్మచర్యంపై గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. దీనిపై మరింత చదవండి :