శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (17:39 IST)

పుష్కరాలకు అంతా సిద్ధం: అద్దెలు రెండింతలు.. సందట్లో సడేమియా..

పుష్కరాలకు అంతా సిద్ధమైంది. జూలై 14 ఉదయం 6.26 గంటల నుంచి ఈ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఇందుకు తగినట్లు వసతులు ఉన్నాయా అంటే ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించట్లేదు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలను మహా పవిత్రంగా జరుపుకుంటారు. అందుకే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు గోదావరి స్నానాలను ఆచరించేందుకు లక్షలాది సంఖ్యలో తరలివస్తుంటారు.  
 
దూరప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి అన్ని రైళ్లలోనూ రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సాధారణంగా పుష్కరాలకు వచ్చిన భక్తులు.. స్నానాలు చేసి.. పూజాదికాలు పూర్తిచేసుకుని వెళ్తుంటారు. పుష్కరాల పన్నెండు రోజులూ ఇక్కడే ఉండాలనుకునే వాళ్లూ కొందరున్నారు. ఇందుకు తగ్గట్టుగా గోదావరి జిల్లాల్లో ఇంటి అద్దెలు ఒక్కసారిగా పెంచేశారు. 
 
నెల రోజుల క్రితమే కొందరిని బలవంతంగా ఖాళీ చేయించి.. భారీగా అద్దెలు వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి మహిమన్వితం ఉన్నదని.. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పిండ ప్రదానాలు చేయవలసిన వారు, పొరుగునే ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునేవారు ముందుగానే ఇక్కడి ఇళ్లు అద్దెకు తీసుకుని అడ్వాన్స్‌లు చెల్లించారు. 
 
ఈ డిమాండ్‌ను పసిగట్టినవారంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నాలుగు గదుల్లో సంసారం చేస్తున్నవారంతా రెండు గదుల్లో సర్దుకుని, మరో రెండు గదులను అద్దెకు ఇచ్చే పనిలో పడ్డారు. పుష్కర నిర్వహణ కోసం పశ్చిమగోదావరి జిల్లాలోనే 10 వేల మంది అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు. వీరికోసం పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో ఉన్న లాడ్జిలు, హోటల్స్‌ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సాధారణ యాత్రికులు బస చేయడానికి అనువైన పరిస్ధితి లేకుండా పోయింది.
 
కొవ్వూరు పట్టణం, పరిసర గ్రామాల్లోనూ ఇళ్ల అద్దెలను ఒక్కసారిగా పెంచేశారు. ఆరువేలు పలికిన డబుల్ బెడ్ రూమ్‌లు రూ.12వేలుగా రెండింతలు పెరిగాయి. కొవ్వూరు పుష్కర క్షేత్రానికి 10 వేల మందిని ప్రభుత్వం నియమించింది. వీరిలో 4 వేల మంది పోలీసులు. మరో 6 వేల మంది ఇతర శాఖల ఉద్యోగులు. వీరి కోసం రిజర్వు చేసిన పాఠశాలలు, కళాశాలల 3 వేల మందికే సరిపోతాయని అంచనా. మిగతా 7 వేలమంది రోడ్లమీదే గడపాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. 
 
మరోవైపు ప్రత్యేకాధికారులను కూడా రాజమండ్రి, కొవ్వూరులకు ప్రభుత్వం పంపనుంది. సుమారు 40 మందికిపైగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అధికారులకు, వారి వెంట వచ్చేవారికి వసతి కల్పించాలి. ఆ పరిస్థితి ఇక్కడ లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు సందట్లో సడేమియా అన్నట్టు ఇప్పుడు అన్నింటికీ ధర పెరిగింది. నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, బెడ్లకు కూడా రోజూ అద్దె అమాంతంగా పెరిగిపోయింది.