శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2015 (18:33 IST)

సకల సౌభాగ్యాలను అందించే వరలక్ష్మీ వ్రతం...

మనకు ధనం, ధాన్యం, సంతానం, విద్య ఇత్యాది సకల సౌభాగ్యాలను అందించే తల్లి వరలక్ష్మీ. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదిన వరలక్ష్మీ వ్రతం పండుగ వస్తుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. అయితే కొత్తగా పెళ్లి అయిన జంట ఈ వ్రతం చేసుకుంటే మరీ మంచిది. ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లాంతా శుభ్రం చేసుకుని, పసుపు, కుంకుమలతో ద్వారాలను అలంకరించి, గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టాలి.
 
ఇంటిలో ఈశాన్యమూలను శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకోవాలి. అక్కడ ఒక పల్లెంలో బియ్యం పోసి, దాని మీద కలశం ఉంచి, అందులో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మెక్కల చిగుళ్లను వుంచాలి. కలశాన్నిగంధం, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరి కాయను వుంచి దానిని కొత్త రవిక గుడ్డతో అలంకరిచుకోవాలి. దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి. 
ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మీ పూజకు ఎర్రటి అక్షింతలు, తామర పూలు, గులాబి పువ్వులు, నైవేద్యానికి బొంబాయి రవ్వతో తీపి పదార్థాన్ని తయారు చేసి ఉంచుకోవాలి. పూజగదిలో రెండు దీపాలతో ఆరేసి వత్తులను వెలిగించాలి. అంతకుముందు  తొమ్మిది ముడులతో తయారు చేసుకొని వుంచుకొన్న తోరగ్రంథులను కలశం మీద వుంచాలి. 
 
ఇప్పుడు ముత్తయిదువలను పిలుచుకుని వారి కాళ్లకు పసుపు రాసి, కుంకుమ పెట్టాలి దీవెనలు అందుకోవాలి. అందరూ కలిసి మండపం ముందు కూర్చిన తమలపాకుపై పసుపు వినాయకుని వుంచి విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకుని, ద్యానావాహనాది షోడశోపచారాలు చేసి లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామం చదువుతూ, అక్షింతలతోనూ, పూలతోనూ అమ్మవారికి పూజ చేయాలి. వరలక్ష్మిని పూజిస్తూ అక్షింతలు వేసుకున్న తర్వాత వరలక్ష్మికి నవకాయ పిండివంటలను నివేదించి కర్పూర నీరాజనం, తాంబూలం అందించుకోవాలి.
 
పూజకు వచ్చిన ముత్తయిదువులకు కూడా శక్తి సామర్థ్యాల మేరకు పసుపు, కుంకుమ, రవికె, పండు, తాంబూలం ఇవ్వాలి. ఇంటి ఆచారాన్ని బట్టి వాయన దానమివ్వాలి. చివరగా పూజలో వుంచిన తోరాలను కుటుంబ సభ్యులంతా చేతికి కట్టుకోవాలి. ఈ వ్రతం ఆచరించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.