సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (20:09 IST)

కేదారేశ్వర వ్రత కథ ఇదే.. ఆచరించే వారికి అన్నీ శుభాలే..!

పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. 
 
ఋషులు-మునులు-అగ్ని--వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.. అట్టి ఆనందకోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. 
 
శివుడాతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగాగల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.
 
కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు.
 
వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. 
 
మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. 
 
వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను.
 
ఇంకా ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు కదళీప్జలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.
 
గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.