శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2015 (17:34 IST)

శ్రీ వేంకటేశ్వరుడు.... అలంకారప్రియుడు.. ఆభరణాలు కోకొల్లలు... వైకుంఠహస్తం గురించి?

తిరుమలలో అఖిలాండ నాయకునికి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రోజుకో వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ.. భక్తులను కనువిందు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఆభరణాల గురించి కాస్త తెలుసుకుందాం.. 
 
అలంకారప్రియుడైన శ్రీ వేంకటేశ్వరునికి ఆభరణాల రూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రాజుల కాలం నుంచి నేటి వరకు ఎంతో మంది భక్తులు శ్రీవారికి అమూల్య ఆభరణాలు కానుకలుగా సమర్పించుకుంటున్నారు. సాలగ్రామశిలా రూపంలో స్వయంభువుగా వెలిసిన శ్రీనివాసునికి బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత మాణిక్యాలతో కూడిన ఆభరణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో కొన్ని అనునిత్యం మూలవరులకు అలంకరిస్తుండగా, మరికొన్నింటిని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే అలంకరిస్తున్నారు.
 
అధికారిక లెక్కల ప్రకారం శ్రీవారి ఆభరణాలు, బంగారు వస్తువుల బరువు 12 టన్నులని, వాటి విలువ 32 వేల కోట్లకు పైబడి ఉండిచ్చని అంచనా. రెండేళ్ల క్రితం ముంబయి, జైపూర్‌లకు చెందిన బంగారు ఆభరణాలు, వజ్రాల విలువను అంచనా వేసే నిపుణులు శ్రీవారి ఆభరణాల నాణ్యతతో పాటు విలువను ఈ మేరకు లెక్కించారు. 
 
టన్నుల కొద్ది బ్యాంకుల్లో డిపాజిట్‌ బంగారాన్ని డిపాజిట్ చేస్తారు. రెండు జాతీయ బ్యాంకుల్లో 2.5 టన్నులకు పైగా బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేసింది. అనాదిగా శ్రీవారికి కానుకల రూపంలో బంగారు ఆభరణాలు అందుతున్నాయి. వీటన్నింటిని శ్రీవారికి అలంకరించలేక అలాగే భద్రపరుస్తూ వచ్చారు. అయితే ఈ బంగారాన్ని వినియోగంలోకి తేవాలనే క్రమంలో ఆభరణాలను ముంబయి మింట్‌కు తరలించి స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా తయారు చేసి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. 
 
ఇక శ్రీవారి ఆనంద నిలయం కోసం 135కిలోల బంగారం అవసరమవుతోంది. శ్రీవారి ఆనంద నిలయం మొత్తాన్ని స్వర్ణమయం చేయాలనే తలంపుతో 2010లో అప్పటి టీటీడీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు సంకల్పించారు. ఈ పథకానికి అవసరమైన బంగారాన్ని శ్రీవారి ఖజానా నుంచి కాకుండా విరాళాలుగా స్వీకరించాలని నిర్ణయించారు. 
 
ఏడాది కాలంలో ఈ అనంత స్వర్ణమయం పథకానికి దాతల నుంచి మొత్తం 135 కిలోల బంగారాన్ని సేకరించారు. నిర్మాణ పనులు కూడా ఆరంభం అయ్యాయి. అయితే దీనిపై ఆగమపండితులు, టీటీడీ ఉన్నతాధికారులు అభ్యంతరాలు చెప్పడం, కోర్టులో వాజ్యాలు పడటంతో ఈ పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ బంగారం టీటీడీ ఖజానాలో ఉంది.
 
శ్రీవారి ఆభరణాల్లో ప్రతి ఒక్కదానికీ ఓ విశేషం ఉంటుంది. అలాంటి ఆభరణాల్లో వజ్ర వైఢూర్యాల వైకుంఠ హస్తం కూడా ఒకటి. స్వామికి శిరస్సు నుంచి పాదాల దాకా వజ్ర వైఢూర్యాలతో కూడిన కవచాలుంటాయి. వైకుంఠహస్తం వీటిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1952లోఈ వైకుంఠ హస్తాన్ని తయారు చేసే ప్రతిపాదన పెట్టగా, 1953 మార్చిలో ఆమోదం లభించింది. వైకుంఠహస్తం తయారీకి 1.3 లక్షలు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. 
 
అది పూర్తయ్యే నాటికి రూ.2.6 లక్షలకు చేరింది. ఈ వైకుంఠ హస్తంలో విలువైన విదేశీ వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు ఉంటాయి. ఈ హస్తంలో విదేశీ వజ్రాలు 2,726, ఎమరాల్డ్స్ 106, రూబీస్ 807 వినియోగించారు. 515 తులాల బంగారం వాడారు. 1954 జూన్ 11వ తేదీన వైకుంఠ హస్తంను స్వామివారికి అలంకరించారు.